– అకాల వర్షాల నేపథ్యంలో అధికారుల నిర్ణయం
– పర్యాటకుల భద్రత దృష్ట్యా యాత్ర రద్దు
– వాతావరణం అనుకూలించిన తర్వాతే పునఃప్రారంభం
రాజమహేంద్రవరం,తెలుగు రాష్ట్రాల పర్యాటకులకు అధికారులు చేదువార్త తెలిపారు. గోదావరి నదిలో అత్యంత ఆదరణ పొందిన పాపికొండల విహారయాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జలవనరుల శాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని విహారయాత్రలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉండటంతో నదీ ప్రయాణం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
నదీ ప్రవాహంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పర్యాటకులు పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వాతావరణ పరిస్థితులు పూర్తిగా మెరుగుపడి, పర్యావరణం అనుకూలించిన తర్వాతే పాపికొండల విహారయాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. యాత్ర పునఃప్రారంభానికి సంబంధించిన తదుపరి వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు.
పాపికొండల విహారయాత్రకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ప్రకృతి సోయగాలకు ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర తాత్కాలికంగా నిలిపివేయడంతో పర్యాటకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది.
