– రూ.1.95 కోట్ల విలువైన 76 దుంగలు స్వాధీనం
– ఒకరి అరెస్ట్, ముగ్గురు పరారీ
– టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులను అభినందించిన డీజీపీ
తిరుపతి శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో భారీ ఎర్రచందనం స్మగ్లింగ్ యత్నాన్ని రెడ్ శాండర్స్
టాస్క్
ఫోర్స్, అటవీ శాఖ అధికారులు భగ్నం చేశారు. గురువారం తెల్లవారుజామున నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్లలో రూ.1.95 కోట్ల విలువైన 76 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఆపరేషన్ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న అధికారులు, రెండు కార్లు, ఒక సరుకు వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు అటవీ ప్రాంతంలో నుంచి పరారైనట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.1.95 కోట్ల వరకు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. స్మగ్లర్లు అక్రమంగా ఎర్రచందనం తరలించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు.
శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్లు మరింత ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. ఈ విజయవంతమైన ఆపరేషన్‌పై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్, అటవీ శాఖ అధికారులను అభినందించారు. అక్రమ రవాణాపై అప్రమత్తంగా వ్యవహరించి స్మగ్లింగ్ యత్నాన్ని అడ్డుకున్నందుకు ప్రశంసలు తెలిపారు. అటవీ సంపదను కాపాడేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
